జనం న్యూస్ ఏప్రిల్ 9 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
విద్యార్థుల భవిష్యత్తుకు మౌలిక సదుపాయాలే పునాది అన్న భావనతో కూకట్‌పల్లిలో మరో ముందడుగు పడింది. స్థానిక డిగ్రీ కళాశాల ప్రాంగణంలో విద్యార్థుల కోసం నూతనంగా నిర్మించిన భవనాన్ని టీపీసీసీ ఉపాధ్యక్షుడు పట్నం మహేందర్ రెడ్డి, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బండి రమేష్ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి, ఎమ్మెల్యే కృష్ణారావు తదితరులు హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు.ప్రారంభోత్సవ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. విద్యార్థులు, అధ్యాపకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నూతన భవనం ఆధునిక సదుపాయాలతో నిర్మించబడినట్లు అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడిన ప్రముఖులు విద్య ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ, “చదువు ఒక్కటే మనిషి జీవితాన్ని మార్చగల శక్తి కలిగిన ఆయుధం” అని పేర్కొన్నారు. విద్యార్థులు లక్ష్య సాధన కోసం కృషి చేయాలని, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో కళాశాలకు అదనపు గదులు, మరో కళాశాల స్థాపనకు అవసరమైన స్థలం, నిధులు సమకూర్చే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అనంతరం విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, అంగన్‌వాడీ టీచర్లకు సెల్‌ఫోన్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ పంపిణీ కార్యక్రమం విద్యా రంగానికి, గ్రామీణ సేవా వ్యవస్థకు సాంకేతిక మద్దతును అందించడంలో కీలకంగా మారనుందని అభిప్రాయపడ్డారు.కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, బ్లాక్ అధ్యక్షులు, మార్కెటింగ్ కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా నాయకులు, యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యూఐ, మైనారిటీ, ఎస్సీ, బీసీ సెల్ నాయకులు, సేవాదళ్ సభ్యులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు



