Listen to this article

జనం న్యూస్, ఏప్రిల్ 14 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, జ్ఞాన సూర్యుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ సమాజానికి ఆయన అందించిన మార్గదర్శకత్వాన్ని పలువురు ప్రముఖులు కొనియాడారు. ఈ సందర్భంగా చిరుమర్తి రాజు మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం ఒక వ్యక్తి కాదని, ఒక ఉద్యమం, ఒక ఆలోచన, సమాజాన్ని మార్గనిర్దేశం చేసే శక్తి అని పేర్కొన్నారు.1891 ఏప్రిల్ 14న జన్మించిన అంబేద్కర్ భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయులలో ఒకరని ఆయన అన్నారు. జీవితాంతం సామాజిక, ఆర్థిక, విద్యా అసమానతల నిర్మూలన కోసం నిరంతరం పోరాడిన ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. అజ్ఞానం నిర్మూలనకు విద్యనే ఆయుధంగా భావించిన అంబేద్కర్ “విద్య పొందండి, సంఘటితమవ్వండి, పోరాడండి” అనే మహోపదేశాన్ని సమాజానికి అందించారని గుర్తు చేశారు.అంబేద్కర్‌ను ఒక వర్గానికి, కులానికి మాత్రమే పరిమితం చేయడం తగదని, ఆయన ఆశయాలు మొత్తం మానవ సమాజానికేనని చిరుమర్తి రాజు స్పష్టం చేశారు. సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం కోసం ఆయన చేసిన త్యాగాలు దేశ ప్రజలందరికీ మార్గదర్శకమని తెలిపారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రతి పౌరునికి హక్కులను కల్పించిందని, అందుకే ఆయన ఆలోచనలు ప్రతి ఒక్కరి జీవితానికి సంబంధించినవని అన్నారు.నేటి యువత అంబేద్కర్ ఆశయ సాధనలో కీలకపాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. చదువు కేవలం ఉద్యోగ సాధనకే కాకుండా సమాజ మార్పుకు దోహదపడే సాధనంగా భావించాలని సూచించారు. కుల, మత, లింగ భేదాలను పక్కన పెట్టి సమానత్వ భావనతో ముందుకు సాగాలని, పేదల అభివృద్ధికి కృషి చేయాలని యువతకు సూచించారు.అదేవిధంగా రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను తెలుసుకుని న్యాయం కోసం నిలబడే ధైర్యాన్ని పెంపొందించుకోవాలని, మూఢనమ్మకాలు, అన్యాయాలు, అవినీతి నిర్మూలనలో యువత ముందుండాలని ఆయన అన్నారు. జ్ఞానం, ధైర్యం ఉంటే సమాజంలో మార్పు సాధ్యమని, అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారానే సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు.“మన కోసం మాత్రమే జీవిస్తే మనతోనే అంతరించిపోతాం, ప్రజల కోసం జీవిస్తే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తాం” అనే అంబేద్కర్ సందేశాన్ని యువత ఆచరణలో పెట్టాలని చిరుమర్తి రాజు కోరారు.