జనంన్యూస్. 16.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ రూరల్ సిరికొండ
సిరికొండ మండలంలోని రైతులు ధాన్యం విక్రయ ప్రక్రియలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వెల్లడిస్తున్నారు. రైస్ మిల్లులకు తగిన కేటాయింపులు లేకపోవడం వల్ల కొనుగోలు ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని వారు పేర్కొన్నారు.రైతుల అభిప్రాయం ప్రకారం, స్థానిక రైస్ మిల్లులకు ధాన్యం అప్పగించేలా అనుమతిస్తే రోజుకు సుమారు 10 నుండి 15 వేల క్వింటాళ్ల వరి సులభంగా క్లియర్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ తగ్గి, మిగిలిన రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు అవసరమైన స్థలం లభిస్తుందని తెలిపారు.దూర ప్రాంత మిల్లులకు ధాన్యం తరలించాల్సి రావడం వల్ల రవాణా ఇబ్బందులు, అదనపు ఖర్చులు, ఆలస్యం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక స్థానిక మిల్లులు అయితే తరుగు, తేమ పేరుతో అధికంగా వెయిట్ లాస్ చేయకుండా ధాన్యాన్ని స్వీకరిస్తాయని, దీనివల్ల రైతులకు నష్టం తగ్గి చెల్లింపులు త్వరగా అందుతాయని తెలిపారు.
ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో వరి నిల్వలు పెరిగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు కురిసే పరిస్థితుల్లో ఈ ధాన్యం నష్టపోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు వెంటనే స్పందించి సిరికొండ మండలంలోని రైస్ మిల్లులకు తగిన కేటాయింపులు చేయాలని, ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు ఉపశమనం కల్పించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.


