జనం న్యూస్ ఏప్రిల్ 16 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకోవాలి
రోడ్డు ప్రమాదాల నివారణకు గ్రామాలలో రోడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాలి
వచ్చే ఏడాది నాటికి సంపూర్ణ క్షయ రహిత జిల్లాగా చేద్దాం
గ్రామాల్లో గంజాయి నియంత్రణకు చర్యలు చేపట్టి అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి
*హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఎస్ఎంఆర్ ఫంక్షన్ హాలులో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం- పాల్గొన్న జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు, వివిధ గ్రామాల సర్పంచ్.ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడానికి గ్రామ, మండల స్థాయి సమావేశాలను నిర్వహిస్తున్నామని హనుమకొండ జిల్లా కలెక్టర్ శ్రీ చాహత్ బాజ్ పాయి తెలిపారు.గురువారం ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఎస్ఎంఆర్ ఫంక్షన్ హాల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా మండల స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ పథకాలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, మహిళలకు అందిస్తున్న సేవలపై జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ వివరించారు. ఇతర శాఖల అధికారులు తమ తమ విభాగాలకు సంబంధించిన కార్యక్రమాలను వివరించారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు.రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోందని, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నిర్మాణ దశల ప్రకారం ప్రతి వారం బిల్లులు సమయానికి చెల్లిస్తున్నామని చెప్పారు. ఎక్కడా బిల్లులు పెండింగ్ లేకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.ఎల్కతుర్తి మండలంలోని చింతలపల్లి, ఇందిరానగర్, గుంటూరుపల్లి గ్రామాలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో 100% ప్రగతి సాధించాయని అభినందించారు. మిగతా గ్రామాలు కూడా అదే విధంగా ముందుకు సాగాలని సూచించారు.బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు అందించి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న చిన్న సమస్యలను సర్పంచులు పరిష్కరించాలని, పంచాయతీల ద్వారా సౌకర్యాలను మెరుగుపరచాలని సూచించారు.అంగన్వాడీ కేంద్రాల్లో 100% విద్యుత్ సౌకర్యం కల్పించాలని, అవసరమైతే ఖాళీ గదులు ఉన్న పాఠశాలలకు తరలించాలని అన్నారు.విలేజ్ న్యూట్రిషన్ డే సందర్భంగా గర్భిణీలు, చిన్నారులు, రక్తహీనత సమస్యలు, పోషకాహార లోపం వంటి అంశాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆశా, ఏఎన్ఎం సిబ్బంది కృషితో జిల్లాలో టిబి కేసులు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. ఎల్కతుర్తిని టిబి రహిత మండలంగా కొనసాగిస్తూ, వచ్చే సంవత్సరం జిల్లాను టిబి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు.ప్రస్తుతం “అరైవ్ అలైవ్” కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు గ్రామాల్లో రోడ్డు సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పించాలని అన్నారు.గంజాయి వ్యాప్తి గ్రామాల వరకూ చేరిందని ఆందోళన వ్యక్తం చేస్తూ, సమష్టిగా దాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ఎక్కడైనా గంజాయి విక్రయాలు జరిగితే వెంటనే నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచించారు.సమావేశం అనంతరం అంగన్వాడీ కేంద్రాలకు చెందిన చిన్నారులకు దుస్తులను కలెక్టర్ పంపిణీ చేశారు. అంగన్వాడీ టీచర్లు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించి, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సుకినే సంతాజీ, సర్పంచ్ లావణ్య, జడ్పీ సీఈవో శేషాద్రి, డిప్యూటీ సీఈవో శ్రీనివాసరావు, డీపీవో లక్ష్మీ రమాకాంత్, డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య, గృహ నిర్మాణ శాఖ పీడీ సిద్ధార్థ నాయక్, డీఈవో గిరిరాజ్ గౌడ్, జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, ఏడీఏ ఆదిరెడ్డి, ఎంపీడీవో విజయ్ కుమార్, తహసీల్దార్ ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.



