Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 24 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ : మట్టికీ, జీవాలకు హాని కలిగించే వ్యవసాయ విధానాల పట్ల విరక్తి కలిగిన సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయం చేయాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ దేశ నలుమూలలకు ఉద్యమాన్ని తీసుకువెళ్లారు . నేలతల్లిని, గోమాతను నమ్ముకుని దోపిడీ విష వలయం నుండి రైతు బయటపడాలని పిలుపునిచ్చారు. ఖరీదైన సేద్యంగా మారడానికి, కర్షకులు అప్పుల ఊబిలో చిక్కుకు పోవడానికి ఆధునిక వ్యవసాయమే కారణమని చెబుతూ.. రైతులు ప్రకృతి సేద్యం వైపు ఆసక్తి చూపాలని పాలేకర్ చెప్పిన వాస్తవ భాష్యాలు ఎందరినో కదిలించాయి. అలా..పాలేకర్ స్ఫూర్తిని పొందిన వ్యవసాయ సాధకులు, ప్రచారకులు విజయరాం ఆలోచన నుంచి పుట్టుకొచ్చినదే శబల భోజనాల పండుగ. విశాఖలో శ్రీ వరాహా నృసింహస్వామి గోశాల వేదికగా ఐదు రోజులపాటు జరిగిన ఈ వేడుకలో గో ఆధారిత, ప్రకృతి వ్యవసాయం ద్వారా కలిగే ప్రయోజనాలను వేలాదిమంది ప్రజలు తెలుసుకున్నారు. అంతేకాకుండా కర్రల పొయ్యలపై వండిన శ్రేష్టమైన శబల భోజనాలను రుచి చూసి ఆస్వాదించారు. స్ఫూర్తి నింపిన ప్రసంగాలు “ఉత్తరాంధ్ర కళలు, చేతివృత్తుల ప్రదర్శనతో సంబరంగా సాగిన శబల భోజనాల పండుగ ఏప్రిల్ నెల ఒకటవ తేదీ నుండి ఐదు రోజులపాటు జరిగింది . గో ఆధారిత వ్యవసాయానికి, ప్రకృతి సేద్యానికి, ఉపాధికి, శ్రేష్టమైన ఆహారానికి భరోసాగా నిలిచిన ‘శబల’ అందమైన గ్రామీణ వాతావరణాన్ని తలపించింది.జీవమున్న ధాన్యంతో ఆహార పదార్థాలు తయారు చేయాలని సూచించింది. ఇందుకు నాందిగా దేవాలయాల్లో ప్రసాద నైవేద్య కైంకర్యాలు భక్తులకు ఇవ్వాలని పేర్కొంది. దేశంలో పారిశ్రామిక విప్లవం, హరిత విప్లవం, సాంకేతిక విప్లవం తరహాలో రాబోయే రోజుల్లో ఆర్గానిక్ విప్లవానికి శబల వంటి కార్యక్రమాలు నాంది పలుకుతాయనడంలో సందేహం లేదు. సనాతన గ్రామీణ ప్రకృతి వ్యవసాయానికి అద్దం పట్టేలా జరిగిన ఈ కార్యక్రమంలో అర్ధ లక్ష మందికి భోజనాలను ఆప్యాయంగా వడ్డించారు. వచ్చిన వారంతా శబల వేదిక వద్ద విజయరాం సమన్వయంతో సాగిన వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు,రైతుల ప్రసంగాలను, సూచనలను ఆసక్తిగా విన్నారు. చట్టాలను అమలు చేసే కార్యనిర్వాహక వ్యవస్థలోని అధికారులను, చట్టాలు చేసే ప్రజాప్రాతినిధ్య వ్యవస్థకు మూలమైన రాజకీయ పార్టీలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేశారు.ఆరోగ్యాన్నిచ్చే వివిధ వంటకాలను ప్రత్యక్షంగా వేదికపై తయారుచేసి చూపించారు. ప్రకృతి సేద్యం ద్వారా విజయాలు సాధించిన రైతుల అనుభవాలను ప్రజలకు తెలియజేశారు. మెలుకువలు, సందేహాలు నివృత్తి చేయడానికి గాను వారి ఫోన్ నెంబర్లు కూడా ప్రజలకు ఇచ్చారు.కళలకు ప్రతీక..శబల వేడుక ఉత్తరాంధ్ర కళలు, చేతివృత్తులు, శాస్త్రీయ నృత్యాలతో శబల భోజనాల పండుగ సందడిగా సాగింది. చిన్నారుల సాంస్కృతిక కళారూపాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. వెదురు బుట్టల ఆల్లిక, కుండలు, మట్టి బొమ్మల తయారీ, పిచ్చుకలకు ఆహారంగా ఏర్పాటు చేసే వరి కంకులు,గుత్తుల అల్లిక, ఎద్దు చెక్క నూనె గానుగ, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే పానీయాలు, తరణి తయారీ, వెన్న చిలకడం, నూలు రాట్నం నడపడం, అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా వివిధ రకాల దేశీయ ఆవులను చూసి ప్రజలు ఆనందపడ్డారు.గోవర్ధనపురం గోశాలకు చెందిన పొట్టిగా ఉండే పుంగనూరు ఆవులు, గుజరాత్, రాజస్థాన్, సింధు ప్రాంతాలకు చెందిన తార్ పార్కర్ , రాఠి, సాహివాల్, కాంక్రెజ్ ఆవుల ప్రదర్శన అత్యంత ఆకర్షణీయంగా నిలిచింది. పర్యావరణహితంగా సాగిన శబల శబల భోజనాల పండుగలో రుచికి, శుచికి ప్రాధాన్యత ఇచ్చారు. ఎవరి ప్లేట్లు వాళ్ళు తెచ్చుకోవాలి. లేని వారికి శబల వారు స్టీల్ ప్లేట్ ఏర్పాటు చేశారు. భోజనం తర్వాత ఎవరి ప్లేట్ వాళ్ళు వరుస క్రమంలో వెళ్లి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీటి వసతి వద్ద శుభ్రం చేయాల్సిందే. నీరు వృధా పోకుండా భూమిలో ఇంకిపోయేలా ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా ప్లాస్టిక్ వినియోగానికి అవకాశం ఇవ్వలేదు.అర్ధ లక్ష మంది భోజనాలు చేసినా ఇసుమంత వ్యర్ధం లేకపోవడం గొప్ప విషయం. ‘ఆర్గానిక్ ఆహారం తిన్నంత పెట్టుకోండి వృధా చేయకండి, కావలసిన వారికి మళ్ళీ వడ్డిస్తాం ‘ అనే ప్రచారంతో ఆహారం వృధా కాకుండా జాగ్రత్త పడ్డారు.ప్రకృతి వ్యవసాయ రైతుల సహకారం తో తమ శక్తికి మించి అనేక ప్రాంతాల నుండి స్వచ్ఛందంగా ఎవరికి తోచింది వారు శబల భోజనాల పండుగ కు ఆర్గానిక్ బియ్యంలో రకాలైన బహురూపి , నవరా, మైసూర్ మల్లికా, దూదేస్వరి, రాజముడి, కుళకార్, తీపి పదార్థాలు ఉపయోగించే కాలా బట్టి ధాన్యం , పప్పులు, సైంధవ లవణం రాక్ సాల్ట్ (ఉప్పు), చెక్క గనుక నూనెలు, వివిధ రకాల సేంద్రియ కూరగాయలతో వంటకాలు తయారుచేశారు.రోజు 11 గంటల తర్వాత ప్రారంభమైనటువంటి భోజనాలు సాయంత్రం ఐదు గంటల వరకు నిర్విరామంగా సాగేవి. వచ్చిన వారందరికీ వేడి గా..తాజా భోజనం అందించారు. భోజనాలు చేసేవారు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని చెప్పినప్పటికీ ఆఫ్లైన్లో నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేసి, వచ్చే వారికి క్రమశిక్షణతో దశలవారీగా ఎలాంటి ఒత్తిళ్లులేకుండా అర్ధ లక్ష మందికి ఉచితంగా భోజన వితరణ సేవ చేశారు.శబల లో నెయ్యి, పెరుగు ప్రత్యేకంగా నిలిచాయి.. సహజంగా అన్నిచోట్ల ఆవు నెయ్యి ఉపయోగిస్తారు.. ఇక్కడ జర్సీ ఆవు కాకుండా , దేశీ ఆవుకు ఆర్గానిక్ ఉత్పత్తులు గడ్డి లాంటివి పెట్టి తద్వారా వచ్చే పాలతో పెరుగు తోడు పెట్టడం, వాటితో వచ్చే కమ్మని నెయ్యను ప్రతి ఒక్కరికి భోజనాల్లో రుచి చూపారు.శబల కు వచ్చిన నిండు గర్భిణులను వేదిక పైన సన్మానించి ముందు చూపుతో కుళకారు బియ్యం, ఆర్గానిక్ ఆవు నెయ్యి ఉచితంగా అందించారు. ప్రతినెల 5 తేది సంకల్ప కళా గ్రామంలో ( విశాఖపట్నం పినగాడి వద్ద ) గర్భిణులకు ఇవ్వాలని నిర్ణయించారు. తద్వారా భవిష్యత్తులో దేశానికి మంచి శ్రేష్టమైన భావితరాలు చూడగలం అన్నారు.పలు సంస్థల భాగస్వామ్యం సేవ్ సంస్థ వ్యవస్థాపకులు విజయరాం తో కలసి సంకల్ప కళా గ్రామం, తులసి ఆర్గానిక్స్, గ్రీన్ క్లైమేట్ , గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సేవా సంఘం, మిద్దె తోట సంఘాలు, మ్యాంగో మ్యాన్ అప్పాజీ, ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్, ఇలా అనేక సంస్థలు కలిసి పని చేసాయి. సింహాచలం దేవస్థానం కార్యనిర్వాహక అధికారి జె.వెంకట్రావు సహాయ సహకారాలు విలువ కట్టలేనివి. ప్రకృతి వైద్య నిపుణులు రవి వర్మ, మిల్లెట్ రాంబాబు, ఆయుర్వేద వైద్యులు సుందర్ రాజె పెరుమాళ్, జనరేషన్ యువ, ఆరాధన హోం పిల్లలు. ఆన్లైన్లో స్వచ్ఛందంగా మూడు వందల మందికి పైగా స్వచ్ఛందంగా పని చేయడానికి నమోదు చేసుకున్న యువత. ఇలా అనేకమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా నిస్వార్థంతో, సేవా తర్పరతతో భాగస్వామ్యం అయ్యారు.