Listen to this article

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్ 25. 04. 2026

ఝరాసంగం మండలంలోని ఈద్దులపల్లి గ్రామ శివారులో వెలసిన జగద్గురు రేవణ సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారి జయంతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం అంకురార్పణ, ధ్వజారోహణం, విఘ్నేశ్వర పూజ, స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, శిఖర పూజ నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం నైవేద్యం, హారతి కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. ఈ కార్యక్రమాల్లో ఈద్దులపల్లి, ఝరాసంగం, మేదపల్లి, దేవరంపల్లి, గినియార్ పల్లి తదితర గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మాతృశ్రీ మఠం శివలీలమ్మ ఆధ్వర్యంలో ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో బసవరాజ్, చంద్రశేఖర్, ఈశ్వరయ్య పాటిల్, పాండు, నాగరాజు, బక్కన్న, తదితరులు పాల్గొన్నారు