జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 28
సెల్ 9550978955 పలమనేరు నియోజకవర్గం వీ.కోట మండల ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యకు గురి కావడంపై స్థానిక ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పలమనేరు నియోజకవర్గంలో ఇలాంటి ఘటన జరగడం చాలా శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. పత్రికా విలేకరిపై జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రశాంతమైన వీ.కోట నడిబొడ్డున ఈ ఘటన జరగడం చాలా దారుణమని నిందితులను వెంటనే గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆయన ఆదేశించారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, ఈ ఘటనకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని మృతుని కుటుంబీకులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆయన తెలియజేశారు. అదేవిధంగా వారి కుటుంబీకులకు తన ప్రగాఢ సానుభూతితో పాటు సంతాపాన్ని ఆయన వ్యక్తం చేశారు.


