Listen to this article

కూలిన విద్యుత్ స్తభంతో బయటపడిన నిర్లక్ష్యం

విద్యుత్ స్తంభం కూలినా స్పందన కరువు

జనం న్యూస్ -ఏప్రిల్ 28- నాగార్జునసాగర్ టౌన్-

నందికొండ మున్సిపాలిటీలో గాలి వానల ప్రభావంతో విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్న ఘటనలో భాగంగా, ఒక విద్యుత్ స్తంభం విరిగి ప్రజలు సంచరించే రోడ్డు పై పడిన సంఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.స్థానికుల కథనం ప్రకారం, విరిగిపడ్డ విద్యుత్ స్తంభం రోడ్డు పై పడటంతో పాటు వైర్లు కూడా చెల్లాచెదురుగా పడిపోవడం గమనార్హం. ఇదే సమయంలో కరెంటు సరఫరా కొనసాగి ఉంటే, ప్రాణ నష్టం ఎంతటి స్థాయిలో జరిగి ఉండేదో ఊహించుకోవడానికే భయంకరంగా ఉందని ప్రజలు అంటున్నారు. రోడ్డుపై నడిచే వ్యక్తులపై లేదా వాహనాలపై ఈ స్తంభం పడిపోయి ఉంటే తీవ్ర గాయాలు, మరణాలు సంభవించే అవకాశం ఉండేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.ఇప్పటికే గాలి వాన కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, సమస్య పరిష్కారం కోసం సంప్రదించాల్సిన సబ్‌స్టేషన్ కార్యాలయ ఫోన్ నంబర్లు (87124 87605) స్విచ్ ఆఫ్‌లో ఉండటం పరిస్థితిని మరింత విషమం చేస్తోంది. అత్యవసర సేవల సమయంలో అందుబాటులో ఉండాల్సిన అధికారులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తెలంగాణ ట్రాన్స్కో పరిధిలో పనిచేస్తున్న సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. ఇటువంటి ఘటనలు పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశమున్నందున, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, దెబ్బతిన్న విద్యుత్ సదుపాయాలను వెంటనే పునరుద్ధరించడం అత్యవసరమని సూచిస్తున్నారు.ఎమర్జెన్సీ సర్వీసులు ప్రజల కోసం ఉంటాయి. అలాంటి సమయంలో అధికారులు అందుబాటులో లేకపోతే ప్రజల భద్రత ఎవరి చేతుల్లో ఉంటుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇకపై ఇలాంటి నిర్లక్ష్యం పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఈ ఘటన ప్రజల ప్రాణ భద్రతపై ఎంతటి ప్రమాదం తలెత్తుతుందో స్పష్టంగా చూపించిందని, విద్యుత్ శాఖ అప్రమత్తత మరింత పెంచాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.