

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి
జనం న్యూస్ ఫిబ్రవరి 18, 2025:కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. జైనూర్ :రానున్న వేసవికాలంలో ప్రజలకు ఎలాంటి త్రాగునీటి సమస్య లేకుండా కార్యచరణ రూపొందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. మంగళవారం జిల్లాలోని జైనూర్ మండలం దుబ్బగూడ గ్రామపంచాయతీలో పర్యటించి మిషన్ భగీరథ నీటి నాణ్యత, త్రాగునీటి కొరకు తీసుకోవలసిన చర్యలపై పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో ప్రజలకు త్రాగునీటి ఎద్దడి లేకుండా కార్యచరణ రూపొందించి ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని తెలిపారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ద్వారా త్రాగునీటిని అందించాలని, ఈ నేపథ్యంలో నీటి ట్యాంకుల శుభ్రత, పైప్ లైన్ల మరమ్మత్తులను వేగవంతం చేసి లీకేజీ సమస్య లేకుండా నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యత, త్రాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థుల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచి నూతన మెనూ అమలు చేస్తుందని, ఈ క్రమంలో విద్యార్థులకు సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడంతో పాటు వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి గౌడ్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల పంచాయతీ అధికారి, మిషన్ భగీరథ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.