

బనగానపల్లె జనం న్యూస్ జనవరి 10 బనగానపల్లె మండల అధికారులతో త్రాగునీరు, పారిశుద్ధ్యంపై రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్థన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల కనీస మౌలిక అవసరాలైన త్రాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, డ్రైనేజీ వంటివాటిపై దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు. మండలంలో అన్ని గ్రామాలను పారిశుద్ధ్యంగా ఉంచడంతో పాటు, ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని స్పష్టం చేశారు. పారిశుద్ధ్య సిబ్బంది ఎంతో కష్టపడుతున్నారని, వారి వేతనాలు పెంచాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మన చుట్టు ప్రక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు, ప్లాస్టిక్ రహిత బనగానపల్లె లక్ష్యంగా అధికారులు పనిచేయాలని పిలుపు ఇచ్చారు. ఈ సమావేశంలో బనగానపల్లె మండల వ్యాప్తంగా గ్రామ పంచాయితీ కార్యదర్శులు, గ్రామ సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది తదితర అధికారులు పాల్గొన్నారు.