Listen to this article

జనం న్యూస్ పిబ్రవరి 21 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ శాసన సభ్యుడు కోనేరు కోనప్ప పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయానికి పంపించారు. క్రియాశీలక రాజకీయాలకు కొద్దికాలం పాటు దూరంగా ఉండాలనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని, ఇప్పటికప్పుడు ఏ పార్టీలో చేరట్లేదనీ పేర్కొన్నారు.
ఆయన సొంత నియోజకవర్గం కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ కాగజ్‌నగర్. నియోజకవర్గ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాల వల్లే కోనేరు కోనప్ప రాజీనామాకు దారి తీశాయని చెబుతున్నారు. సొంతగూటికి చేరిన తరువాత ఆయనను పక్కనపెట్టారని చెబుతున్నారు గతంలో కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు కొనసాగారు కోనేరు కోనప్ప. 2004లో సిర్పూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2014 నాటి ఎన్నికల్లో బహుజన్ సమాజ్‌ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత బీఆర్ఎస్‌లో చేరి, ఆ పార్టీ తరఫున పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. నియోజకవర్గంలో తనపై పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను పార్టీలో చేర్చుకోవడం పట్ల కేసీఆర్‌తో విభేదించారు. గత ఏడాది మార్చిలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థాన్ని పుచ్చుకున్నారు. సొంతగూటికి చేరుకున్నారు.ఇటీవలే తన నియోజకవర్గానికి కేటాయించిన ఫ్లైఓవర్ రద్దు కావడం కోనప్పను తీవ్ర అసంతృప్తికి గురి చేసిందని అంటున్నారు. కాంగ్రెస్‌ను దొంగల గుంపుగా విమర్శించారాయన. ఈ విషయంపై రేవంత్ రెడ్డితో మాట్లాడినప్పటికీ ఎలాంటి హామీ లభించలేదని, ఫలితంగా వారం రోజుల కిందటే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనికి అనుగుణంగా ఇప్పుడాయన రాజీనామా చేశారు.