

జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
జనం న్యూస్ 21 ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమెల్ల శంకర్ ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లానందు కొత్తగూడెం రైటర్ బస్తీలోని ప్రత్యేక అవసరాలు గల పిల్లల వనరుల కేంద్రాన్ని (భవిత ) జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ సందర్శించారు. అన్ని రకాల వైకల్యాల గల పిల్లలకు కావలసిన ఉపకరణాల గురించి భవిత సిబ్బందిని అడిగి తెలుసుకోవడం జరిగింది, స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, ఆడియాలజిస్ట్ అవసరాన్ని, జిల్లాలో నిర్వహిస్తున్న సమ్మిళిత విద్యా విధానం గురించి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ యస్. కె. సైదులు కలెక్టర్ కు వివరించారు. భవిత పాఠశాల ఆవరణలో గల పాత భవన నిర్మాణాన్ని తొలగించి వారికి ఆట స్థలం ఏర్పాటు అయ్యేలా చూడాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. తదుపరి పాల్వంచ భవిత కేంద్రాన్ని కూడా ఈ సందర్బంగా సందర్శించి దివ్యాంగ పిల్లలతో ఇంటరాక్ట్ అయి పిల్లల ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించారు. ముఖ్యంగా అబ్దుల్ అజీజ్ అనే విద్యార్థి భవిత కేంద్రం లో అందించిన ఫిజియో థెరపి ద్వారా, మంచానికి పరిమితం అయిన స్థితి నుండి స్వయంగా నిలబడి, నడవగలిగే స్థితికి వచ్చిన విద్యార్థి యొక్క సక్సెస్ స్టోరీని స్వయంగా విని కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ITI చదువుతున్న అబ్దుల్ అజీజ్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కేంద్రాన్ని సందర్శించడం జరిగిందని, దివ్యాంగ పిల్లల తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తుకు సంబంధించి చర్చించడం జరిగిందన్నారు. పిల్లలు దేవుడిచ్చిన వరంగా భావించాలని, వారి నైపుణ్యాలను తీర్చిదిద్ది, స్పెషల్ స్కూల్ నుంచి నార్మల్ స్కూల్ కు మెయిన్ స్ట్రీమ్ చేయడానికి ఇక్కడున్న సిబ్బంది కృషి చేస్తున్నారని, ప్రత్యేక అవసరాల పిల్లలకు కావలసిన ఉపకరణాల గురించి, వారి భవిష్యత్తును తీర్చిదిద్దడానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. రానున్న కాలంలో దివ్యాంగ పిల్లలకు సమ్మిళిత విద్యను భవిత కేంద్రాల ద్వారా పూర్తి స్థాయిలో అందించేందుకు చేపట్టవలసిన కార్యకలాపాలపై పక్కా ప్రణాళిక ను రూపొందించి దివ్యాంగ పిల్లలకు మంచి భవిష్యత్ ను అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా విద్యాధికారి ఎం. వెంకటేశ్వర చారి , సమ్మిళిత విద్యా కోఆర్డినేటర్ యస్. కె. సైదులు, మండల విద్యాధికారి శ్రీరామ్మూర్తి, రిసోర్స్ పర్సన్ లు శ్రీరామ్, కనక దుర్గా, అరుణ కుమారి, అనిత తదితరులు పాల్గొన్నారు.