

తన అనుచరులతో రహస్య సమావేశం.. పట్టభద్రుల ను అప్రమత్తం చేసినా వెంకట్..
జనం న్యూస్ // ఫిబ్రవరి // 24 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ తదితర ఉమ్మడి జిల్లాలకు చెందిన పట్టభద్రుల ఎన్నికకు సంబంధించిన పోలింగ్ జరగడానికి కేవలం 3 రోజుల సమయం మాత్రమే ఉన్న తరుణంలో ప్రముఖ సామాజికవేత్త… రాజకీయ విశ్లేషకులు… జెన్ ప్యాక్ ( జెన్పాక్ ) అనే మల్టీ నేషనల్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న సబ్బని వెంకట్ ఆదివారం రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా తయారైంది. గత కొద్దిరోజులుగా హైదరాబాదులో ఉద్యోగరీత్యా బిజీబిజీగా ఉంటున్న వెంకట్ తన స్వగ్రామమైన హుజురాబాద్ మండలం సిరిసపల్లి గ్రామానికి ఆదివారం మధ్యాహ్నం హుటాహుటిన తరలి రావడం వెనుక కారణాలు ఏమై ఉంటాయో, అర్థం కావడం లేదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. తన పర్యటనకు ముందే అందుబాటులో ఉన్న పట్టభద్రులందరినీ అప్రమత్తం చేసిన వెంకట్ ఆదివారం రాత్రి ఒక రహస్య సమావేశంలో మూడు గంటల పాటు వారితో చర్చలు జరిపినట్లు తెలిసింది. హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని జమ్మికుంట ఇల్లంతకుంట,వీణవంక,హుజురాబాద్,కమలాపూర్,వావిలాల, చల్లూరు,శంకరపట్నం, మానకొండూర్,సుల్తానాబాద్, తదితర ప్రాంతాల నుండి వెంకట్ అనుచరులుగా గుర్తింపు పొందిన పట్టభద్రులు ఈ రహస్య సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం. పైన పేర్కొన్న మండలాలకు సంబంధించిన మెజారిటీ పట్టభద్రుల ఓట్లను సంపాదించుకోవాలని గత రెండు మూడు వారాలుగా బిజెపి కాంగ్రెస్ పార్టీలు వేర్వేరుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్న విషయం పాఠకులకు విధితమే. ఈ తరుణంలో వెంకట్ అనుకోకుండా రంగంలోకి రావడం వల్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి లాభం జరగబోతున్నదా లేక భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి లబ్ధి చేకూరబోతున్నదా, అనే విషయంలో తర్జనభర్జన జరుగుతున్నది. రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్ పర్యటనలో ఉన్నటువంటి సబ్బని వెంకట్ ఆగమేఘాల మీద హైదరాబాద్ రావడం,అక్కడనుండి తన ప్రాంతమైన హుజురాబాద్ రావడంలోని ఆంతర్యం ఏమిటో, ఈగత సంవత్సర కాలంగా హుజురాబాద్ లొ అనేక సామాజిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తుండడం, తన వాట్సాప్ గ్రూపులలో వందలాది యువకులను చేర్పించుకొని వారిద్వారా రక్తదాన కార్యక్రమాలను, ఇతరత్రా సేవా కార్యక్రమాలను వెంకట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే,అదేవిధంగా కరీంనగర్ వరంగల్ సిద్దిపేట పెద్దపల్లి సిరిసిల్ల జగిత్యాల వంటి అనేక జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేటు కంపెనీలలో ఈయన ఉపాధి కల్పించడం ద్వారా వారి కుటుంబాలకు చేరువయ్యారు. ఈ రకంగా కొన్ని వందల మంది నిరుద్యోగ పట్టబద్రులు నిత్యం సబ్బని వెంకట్ తో సంబంధాలు కొనసాగిస్తుంటారు. వీరందరితో ఆయనకు బలమైన సంబంధాలు ఉండడం వల్ల ,, ఏ అభ్యర్థికి ఓటు వేయమంటే ఆ అభ్యర్థికే మద్దతు తెలుపుతామంటూ అనేకమంది పట్టభద్రులు గత రెండు మూడు వారాలుగా బాహాటంగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తుండడం గమనార్హం. పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల తేదీ సమీపిస్తున్నందున వారు ప్రచార పర్వంలో బిజీ బిజీగా ఉండడంతో వెంకట్ కదలికలను ప్రతిక్షణం గమనించాలని తమ అనుచరులను బిజెపి కాంగ్రెస్ పార్టీలు ఆదేశించినట్లు తెలుస్తోంది. కాగా వెంకట్ నిర్వహించిన రహస్య సమావేశం తర్వాత ఆయన గ్రూపుకు చెందిన పట్టభద్రులు తమతమ గ్రామాలకు వెళ్లిపోవడంతో అసలు ఏమి జరుగుతున్నదో అర్థం కావడం లేదని జమ్మికుంటకు చెందిన ఒక సీనియర్ రాజకీయ నాయకుడు వాపోవడం గమనార్హం. ఎన్నికలు జరిగే ఈ నాలుగు రోజులపాటు తాను హుజురాబాద్ నియోజకవర్గం, కరీంనగర్ జిల్లాలోనే ఉంటానని, 27వ తేదీ గురువారం సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత తాను తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతానని సబ్బని వెంకట్ స్పష్టం చేయడంతో రాజకీయ వాతావరణం మరింత హీటెక్కిందని చెప్పక తప్పదు. ప్రధాన పార్టీలలో ఏదో ఒక పార్టీని వెంకట్ తెర వెనుక బలపరుస్తున్నాడా ? లేక ఇండిపెండెంట్ అభ్యర్థులలో బెస్ట్ పర్సన్ ను… గుర్తించి అతడి వైపు మొగ్గుచూపుతున్నాడా, అనే విషయం ఎన్నికల నాటికి లేదా పోలింగ్ తర్వాత నైనా తెలుస్తుందని ఎవరికి వారు సర్దిపుచ్చుకుంటున్నారు. మొత్తంగా చూస్తే పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న సమయంలో వెంకట్ హుజరాబాద్ లో అడుగు పెట్టడం, ఆ మరుక్షణమే తన బలగమైన పట్టభద్రులతో రహస్య సమావేశం నిర్వహించడం… పనిలోపనిగా పోలింగ్ ముగిసే వరకు తాను స్థానికంగానే ఉంటానని తన శ్రేణులకు మరి మరి చెప్పడం వెనుక ఆయన ఆంతర్యం ఏమిటో ఎవరికి అంతుచిక్కడంలేదనే వ్యాఖ్యానాలు వినబడుతున్నాయి. మరోవైపు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఈ విషయంలో తగిన సమాచారం రాబట్టడానికి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.