Listen to this article

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్

జనం న్యూస్ 04 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్

విజయనగరం జిల్లా బొండపల్లి పోలీసు స్టేషన్లో 2020లో నమోదైన వరకట్న వేధింపుల కేసులో నిందితుడు అయిన గంట్యాడ మండలం చంద్రంపేట గ్రామానికి చెందిన కుప్ప తవిటయ్యకి 5వ ADJ మరియు మహిళా కోర్టు స్పెషల్ జడ్జి ఎన్.పద్మావతి గారు 10సం.ల కఠిన కారాగార శిక్ష, రూ.2,500/- జరిమాన విధిస్తూ తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మార్చి 3న తెలిపారు. వివరాల్లోకి వెళితే.. నిందితుడు గంట్యాడ మండలం చంద్రంపేటకు చెందిన కుప్ప తవిటయ్య చెడు అలవాట్లకు లోనై, తరుచూ భార్యను అదనంగా కట్నంను వారి కన్నవారింటి నుండి తీసుకొని రావాలని వేధిస్తుండేవాడన్నారు. ఇదే క్రమంలో భార్యను చంపాలనే ఉద్దేశ్యంతో నిందితుడు బొండపల్లి మండలం బి.రాజేరు గ్రామంలో వచ్చి, భార్య మరియు ఇతర కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో పాక ఇంటికి నిప్పు పెట్టి, హత్యాయత్నంకు పాల్పడడంతో బొండపల్లి పోలీసు స్టేషన్ అప్పటి ఎస్సై డి.సాయి కృష్ణ కేసు నమోదు చేసి, దర్యాప్తు పూర్తి చేసి, నిందితుడిని అరెస్టు చేసి, న్యాయస్థానంలో అభియోగ పత్రం దాఖలు చేశారన్నారు. ఈ కేసులో నిందితుడిపై నేరారోపణలు రుజువు కావడంతో నిందితుడు కుప్ప తవిటయ్యకి 10 సం.లు కఠిన కారాగార శిక్ష, రూ.2,500/- జరిమాన విధిస్తూ 5వ ADJ మరియు ఉమెన్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎన్.పద్మావతి గారు తీర్పు వెల్లడించారన్నారు.
ఈ కేసులో పోలీసు వారి తరుపున అడిషనల్ పిపి ఎన్.శకుంతల గారు వాదనలు వినిపించగా, కోర్టు హెచ్.సి. ఎం.ప్రకాశరావు సాక్షులను ప్రవేశపెట్టారని, గజపతినగరం సిఐ జీఎవి రమణ, బొండపల్లి ఎస్సై యు.మహేష్ ప్రాసిక్యూషను పర్యవేక్షించారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.