


జనం న్యూస్ // మార్చ్ // 4// జమ్మికుంట // కుమార్ యాదవ్.. దశాబ్దాల కాలంగా పరిష్కారానికి నోచుకోని జమ్మికుంట రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, అసంపూర్తిగా నిలిచిపోయిన ఉప్పల్ ఆర్ వో బి, భావుపేట నూతన ఆర్ వో బి నిర్మాణానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ చొరవతో పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. కాంగ్రెస్ నాయకులు కసుబోజుల వెంకన్న, ఎండి సలీం పాషలు ఈటల కు ఇందుకు సంబంధించి వినతి పత్రం సమర్పించిన విషయం తెలిసిందే. ఈమేరకు ఎంపీ ఈటల రాజేందర్ జమ్మికుంట రైల్వే స్టేషన్ లో నెలకొన్న సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని చేసిన సూచనలపై సోమవారం రామగుండం అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ మనోజ్ కుమార్ గుప్తా బృందం జమ్మికుంట రైల్వే స్టేషను సందర్శించారు . కొత్తపల్లి- జమ్మికుంట పట్టణాన్ని అను సంధానించే ఫుట్ ఓవర్ సౌకర్యం లేక గ్రామస్తులు అదనంగా మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ఫలితంగా గ్రామస్తులు అనేక ఇబ్బందులకు గురవుతున్న తీరును అధికారులు దృష్టికి తీసుకెళ్లడంతో ఈ మేరకు స్థల పరిశీలనకు వచ్చిన ఇంజనీరింగ్ అధికారులు స్థానిక బిజెపి నాయకులు, కొత్తపల్లి గ్రామస్తులతో సమస్యపై చర్చించి అనువైన స్థల పరిశీలన చేశారు. ఫుట్ ఓవర్ తో పాటు కొత్తపల్లి వైపు టికెట్ బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఎస్కలేటర్ సౌకర్యం కల్పించాలని కోరగా అధికారులు తదనుగుణంగా మ్యాపు సిద్ధం చేశారు. ఈ మేరకు ప్రతిపాదనలు తయారుచేసి ఉన్నతాధికారులకు నివేదిస్తామని వెల్లడించారు. జమ్మికుంట రైల్వే స్టేషన్లో తమ దృష్టికి వచ్చిన సమస్యలతోపాటు ఉప్పల్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని ఆరు నెలల్లో పూర్తి చేస్తామని, అదేవిధంగా బావుపేట ఆర్ఓబి నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు చెప్పారు. ప్రతిపాదనలు రూపొందించిన అనంతరం ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరుకై తయారుచేసిన ప్రతిపాదనలు అందజేయనున్నట్టు వివరించారు. అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ను కలిసిన వారిలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు, శీలం శ్రీనివాస్, జీడి మల్లేష్ ,మోతే స్వామి, ఇటికాల స్వరూప, పల్లపు రవి, నిరుపారాణి, స్వరూప ఇనుగాల రత్నాకర్, రాకేష్ ఠాకూర్, గుర్రం పరుశురాం లతోపాటు కాంగ్రెస్ నాయకులు కసుబోజుల వెంకన్న, ఎండి సలీం పాషా కొత్తపల్లి గ్రామస్తులు ఉన్నారు.