


జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 4. తర్లుపాడు మండలంలోని పోతలపాడు మరియు కందల్లపల్లె గ్రామాలలో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ అధికారి శ్రీ టి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతులు 11 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య చేయించుకొనుటకు మార్చి 31 వరకు గడువు పెంచినారని, రైతులు ఆధార్ నెంబర్ కు ఫోన్ నెంబర్ లింక్ లేనప్పటికీ ఫేషియల్ ద్వారా నమోదు ప్రక్రియ పూర్తిచేసే వెసలబాటు కల్పించినారని, అలానే మార్క్ ఫెడ్ వారు తర్లుపాడు సొసైటీ ద్వారా వారంలో కందులను ప్రభుత్వ మద్దతుధర అయిన రూ.7550/- క్వింటాకు కొనుగోలు చేయునని, కంది రైతులందరూ బయట మార్కెట్ నందు తక్కువ ధరకు అమ్ముకొనరాదని, సొసైటీ ద్వారా మద్దతు ధరకు అమ్ముకొనవలెనని విజ్ఞప్తి చేశారు. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ జె జసౌజన్య మాట్లాడుతూ 01.03.2025 నుండి 31.03.2025 వరకు ప్రతి గ్రామాలలోనూ 4 నెలల పైబడిన దూడల నుండి ప్రతి పాడి గేదెలకు, ఎద్దులకు, గాలికుంటు టీకాలు వేయడం జరుగుతుందన్నారు. ఈ వ్యాధి వస్తే పాడి పశువులలో పాలు గణనీయంగా తగ్గుతాయని, ఎద్దులలో పనిచేసే సామర్థ్యం తగ్గిపోతుందని, తల్లి పాలు తాగే లేగ దూడలు సైతం మరణిస్తాయని వివరించారు. గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు కచ్చితంగా చేయించాలని కోరారు. అదే విధంగా 4 నుండి 8 నెలల వయస్సు ఉన్న పెయ్యి దూడలకు బ్రూసిల్లోసిస్ టీకాలు వేయడం జరుగుతుందన్నారు. పశు బీమా పథకం మళ్లీ అందుబాటులో ఉందని మిగిలిన రైతులు సంబంధిత రైతు సేవ కేంద్రం నందు కానీ, పశువైద్య కేంద్రంలో కానీ సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సహాయక సిబ్బంది రాధ,శ్వేత, మునికాశయ్య మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.