

జనం న్యూస్ 05 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం టాటా మ్యాజిక్, ఆటో, పాసింజర్ వాహనాల పై గ్రీన్, రోడ్, లేబర్ టాక్స్ లు వేస్తూ టాక్స్లు థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ భారీగా పెంచి డ్రైవర్ల రక్తాన్ని పిల్చేస్తూ రక్తమాంసాలతో కూటమి పాలకుల దాహం తీర్చుకుంటారా అని ఎఐటీయూసి జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంగళవారం ఉదయం ఎ.పి ఆటో, టాటా మేజిక్ అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ ( ఏఐటీయూసీ అనుబంధం) ఆధ్వర్యంలో 2025 ఫిబ్రవరి 24 నుండి జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో ఆటో డ్రైవర్స్ అండ్ మోటార్ కార్మికులకు ఎన్నికలలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 2025 మార్చి 4న రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్స్ అండ్ మోటార్ కార్మికులు నిరసనలు చేసి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని ఇచ్చిన పిలుపులో భాగంగా విజయనగరం మయూర జంక్షన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టి నిరసన తెలిపారు.
అనంతరం బుగత అశోక్ మీడియాలో ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో గానీ నేడు అసెంబ్లీలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో కనీసం మోటార్ వెహికల్ డ్రైవర్ల సంక్షేమం కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడంలోనే ఆటో అండ్ మోటార్ కార్మికులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాయని తేట తెల్లమవుతందని మండిపడ్డారు. ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక భారాలతో రాబడి లేక ఇబ్బందులు పడుతుంటే మరోపక్క టాక్స్ ల పేరుతోనూ, టోల్ గేట్ల వసూళ్ళ దందాలతోనూ డ్రైవర్ల రక్తాన్ని పీల్చుకుని ప్రభుత్వాలు దాహం తీర్చుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క పుండు మీద కారం చల్లినట్టు ర్యాపిడో, ఒలా యాప్ లను తెచ్చి డ్రైవర్ల పొట్టలు కొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. జొన్నాడ టోల్ గేట్ వ్యతిరేక పోరాటంలో నేడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కూడా భాగస్వామ్యం అయ్యి ఆ టోల్ గేట్ ను రద్దు చేసి అవుటర్ రింగ్ రోడ్డులో మార్పు చేస్తామని ఇచ్చిన హామీలు ఎందుకు అమలు జరపలేదని ప్రశ్నించారు. ఇది చాలదు అన్నట్టు మానాపురం దగ్గరలో కూడా టోల్ గేట్ ఏర్పాటు చేయడానికి సిద్ధం అవ్వడం అంటే దారి దోపిడీదారులుగా ప్రభుత్వాల ఆలోచనలు ఉన్నాయని విమర్శించారు. ప్రభుత్వాలు అవలంభిస్తున్న డ్రైవర్ కార్మిక వ్యతిరేక విధానాల వలన అధిక వడ్డీలకు అప్పులు చేసి ఫైనాన్స్ వాళ్ళ దగ్గర లక్షలాది మంది ఆటో, టాటా మేజిక్ వాహనాలు కొనుక్కుని నడుపుతూ కుటుంబాలను పోషించుకుంటున్న డ్రైవర్లు అందరూ రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే జీవో నెంబర్ 21 31 రద్దు చేయాలి, వాహన మిత్ర 15 వేల రూపాయలు ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జి ఆర్ ఎస్ 124( e) నోటిఫికేషన్ 8 94 నోటిఫికేషన్ డ్రైవర్లకు ఉపాధి లేకుండా చేసే 2023 నూతన మోటారు యాక్ట్ చట్టం 106(1)(2) ను రద్దు చేయాలని, టాటా మ్యాజిక్ వ్యానులు కార్లు జీపులపై భారీగా పెంచిన రోడ్ టాక్స్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, గ్రీన్ టాక్స్, లేబర్ టాక్స్, టోల్గేట్ ఫీజులను 30 శాతానికి తగ్గించి డ్రైవర్ల పిల్లలకు విద్యా కానుక వెంటనే ఇవ్వాలి. ఆటో డ్రైవర్స్ అండ్ మోటార్ కార్మికులకు పీఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ తో కూడిన సంక్షేమ బోర్డు చేయాలని డిమాండ్ చేశారు. అవసరం లేని చోట టోల్ గేట్లను ఎత్తివేయాలని, టోల్ గేట్ రుసుము తగ్గించాలని డిమాండ్. మోటార్ కార్మికుల పై ఆర్థిక భారాలు వేసే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, విద్యుత్తు, నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించి డ్రైవర్ల కుటుంబాలకి బ్రతుకు రక్షణ కల్పించాలన్నారు. అచ్యుతాపురం ఎఫ్.సి ను ప్రైవేటోళ్ళకి అప్పగించాలని ఆలోచన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. డ్రైవర్ల సమస్యలు పరిష్కారం లేనిపక్షంలో పోరాటాలు తప్పవని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుడు ఎస్ రంగరాజ మాట్లాడుతూ ప్రభుత్వాలు దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు టాటా మ్యాజిక్ వాహనాలపై భారీగా పెంచిన విజయనగరం వ్యానులు ఆటోలకి పార్కింగ్ స్టాండ్లు ఏర్పాటు చేయాలని పెంచిన డీజిల్ పెట్రోల్ విడిభాగాల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. టోల్ పంజా ఫీజులు మరియు జి ఎస్ టి పన్నులను రద్దుచేసి రవాణా రంగాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎస్ రంగరాజు, జిల్లా కార్యదర్శి పురం అప్పారావు, యూనియన్ గౌరవాధ్యక్షుడు పి. ఈశ్వరరావు, అధ్యక్షుడు ఎమ్.చంద్ర, ఉపాధ్యక్షుడు బి.చిన్న, కార్యదర్శి బి. సంతోష్ కుమార్, కోశాధికారి పి. సుధ, సభ్యులు టీ తిరుపతిరావు మరియు మెక్సీ క్యాబ్, ఆటో, జీపు, ట్యాక్సీ డ్రైవర్లు పాల్గొన్నారు.