

జనం న్యూస్ 05 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టరు డా.బి.ఆర్.అంబేద్కర్ మార్చి 4న పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, జిల్లా కలెక్టరు డా.బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో మార్చి 4న నార్కోటిక్ కో-ఆర్డినేషను కమిటీ (NCORD) సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టరు డా. బిఆర్ అంబేద్కర్, జిల్లా ఎస్పీ నకుల్ జిందల్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు డా. బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ – జిల్లాను గంజాయిరహితంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. మాదక ద్రవ్యాల వలన కలిగే ఆసర్భాలను ప్రజలకు వివరించి, వాటి దుష్పప్రభావాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబరు 1972 పట్ల అధికారులు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. జిల్లాలోగల అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్, కళాశాలలు, ఇంజనీరింగు, మెడికల్ కాలేజ్లు, ఐటిఐ, పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్యార్థులకు ‘సంకల్పం’ కార్యక్రమంతో డ్రగ్స్ వినియోగం, వాటి వలన కలిగే దుష్ప్రభావాలను ప్రచారం చేయాలన్నారు. ప్రతీ రోజూ ప్రార్ధన నిర్వహించే సమయంలో ఉపాధ్యాయులు 10 నిమషాల పాటు డ్రగ్స్ గురించి చర్చను నిర్వహించాలన్నారు. అంతేకాకుండా, డ్రగ్స్గురించిన సమాచారంను అందించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన డ్రాప్ బాక్సులను విద్యాసంస్థలో ఏర్పాటుచేయాలన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రభుత్వ ఆదేశాలతో వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలో ఈగల్బృందాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ వినియోగం వలన కలిగే అనర్థాలను యువతకు, విద్యార్ధులకు వివరించేందుకు ప్రత్యేకంగా కరపత్రాలను ముద్రించి, పంపిణీ చేయాలని స్త్రీ, శిశు సంక్షేమశాఖ అధికారులను ఆదేశించారు. డీ-అడిక్షను సెంటరు పూర్తి స్థాయిలో పని చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలను రూపొందించి, నివేదించాలని, వెంటనే అవసరమైన మౌళిక వసతులను, నియామకాలను చేపడతామన్నారు. మందుల షాపుల్లో విక్రయిస్తున్న డ్రగ్స్న త్రించేందుకు పోలీసు, డ్రగ్స్ డిపార్టు సంయుక్తంగా దాడులు నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టరు డా. బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా గంజాయి సాగు లేదన్నారు. సరిహద్దు జిల్లాలైన ఎఎస్ఆర్, ఒడిస్సా, చత్తీస్గడ్ రాష్ట్రాల నుండి గంజాయి రవాణ జరుగుతుందని, అక్రమ రవాణను కట్టడి చేసేందుకు జిల్లాలో నిరంతరం పని చేసేందుకు ఐదు పోలీసు చెక్ పోస్టులను ఏర్పాటు చేసామన్నారు. వీటితోపాటు ఆకస్మికంగా డైనమిక్ వాహన తనిఖీలను 10 ప్రాంతాల్లో ప్రతీ రోజూ నిర్వహిస్తున్నామన్నారు. గత సం. కంటే గంజాయి అక్రమ రవాణను నియంత్రిస్తూ, 139శాతం అధికంగా ఎన్ఫోర్సుమెంటు కేసులను పెట్టామన్నారు. గంజాయి అక్రమ రవాణకు పాల్పడుతున్న 32మంది అంతరాష్ట్ర నిందితులను, 19మంది అంతర జిల్లా నిందితులను అరెస్టు చేసామన్నారు. గంజాయి వ్యాపారంతో ఆస్తులను కూడబెట్టిన నిందితుడికి చెందిన రూ.1.96 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసామన్నారు. సంకల్పం పేరుతో విద్యార్థులు, యువతను చైతన్యపర్చేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని, క్షేత్ర స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా సంకల్ప రధంతో వీడియోలను ప్రదర్శించి, మాదక ద్రవాలకు దూరం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే జిల్లాలో 1,18,000మంది విద్యార్థులకు అవగాహన కల్పించామన్నారు. 1942చోట్ల జిల్లాలో సంకల్పం కార్యక్రమాలను నిర్వహించామన్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన యువతకు స్వస్థత చేకూర్చేందుకు డీ-అడిక్షన్ సెంటర్స్ పూర్తి స్థాయిలో పని చేసే విధంగా చర్యలు చేపట్టాలని, ఇతర శాఖలు కూడా సమన్వయంతో పని చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ కోరారు. జిల్లా పోలీసుశాఖ చేపట్టిన కార్యక్రమాలు, ప్రగతిని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషను ద్వారా వివరించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డిఆర్డీఓ శ్రీనివాసరావు, విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి డిఎస్సీ జి.భవ్య రెడ్డి, ఆర్డీఓలు, వైద్య, ఆర్టీఎ, ఆర్టీసి, మెరైన్, జిఆర్పి, ఫారెస్టు, అగ్రికల్చర్, వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.