బీజేపీకి డాక్టర్ రఘు రాజీనామా.. త్వరలో రాజకీయ భవిష్యత్‌పై కీలక నిర్ణయం
జనం న్యూస్, జులై 13, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : మెట్‌పల్లిలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకుడు, నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు డాక్టర్ రఘు తన రాజకీయ ప్రయాణానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన, పార్టీ తనపై ఉంచిన నమ్మకానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. పార్టీ జాతీయ నాయకత్వంపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని స్పష్టం చేస్తూనే, పార్లమెంట్ సెగ్మెంట్ స్థాయిలో ఏర్పడిన కొన్ని రాజకీయ పరిస్థితుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. సందర్భంగా డాక్టర్ రఘు మాట్లాడుతూ, కోరుట్ల నియోజకవర్గంలో బీజేపీ బలోపేతమే లక్ష్యంగా ఎన్నో సంవత్సరాలుగా అంకితభావంతో పనిచేశానని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి గ్రామంలో కార్యకర్తలతో కలిసి పనిచేశానని, పార్టీ తనకు అప్పగించిన ప్రతి బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించానని చెప్పారు. ఈ రాజకీయ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి, అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.తన వల్ల ఎప్పుడైనా ఏ కార్యకర్తకైనా మనస్తాపం కలిగితే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని డాక్టర్ రఘు అన్నారు. రాజకీయంగా మార్గాలు వేరైనా కార్యకర్తలతో తన అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుందని, వారికి ఎలాంటి అవసరం వచ్చినా గతంలోలాగే అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. తనకు పదవుల కంటే కార్యకర్తల ప్రేమ, ప్రజల విశ్వాసమే ముఖ్యమని పేర్కొన్నారు.ఇటీవల జరిగిన మెట్‌పల్లి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 10 వార్డుల్లో విజయం సాధించడం ప్రతి కార్యకర్త చేసిన కష్టానికి ప్రతిఫలమని ఆయన అన్నారు. ఈ విజయాన్ని తన విజయంగా గానీ, ఒక్క నాయకుడి విజయంగా గానీ భావించడం లేదని, ఎంపీ బండి సంజయ్‌తో పాటు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు అహర్నిశలు శ్రమించారని తెలిపారు. బీజేపీ జెండాను మెట్‌పల్లి మున్సిపాలిటీలో ఎగరవేయాలనే సంకల్పంతో పనిచేసిన కార్యకర్తల సేవలను పార్టీ నాయకత్వం తప్పకుండా గుర్తించాలని కోరారు.పార్టీని వీడడం తనకు కూడా ఎంతో బాధ కలిగించిందని, బీజేపీని ఒక కుటుంబంలా భావించి పనిచేశానని డాక్టర్ రఘు భావోద్వేగానికి గురయ్యారు. అయితే వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని వివరించారు. తన రాజకీయ భవిష్యత్‌కు సంబంధించిన నిర్ణయాన్ని ముందుగా కార్యకర్తలతో చర్చించి, వారి అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతే అధికారికంగా ప్రజలకు వెల్లడిస్తానని స్పష్టం చేశారు.రాజకీయాల్లో తనకు ఎలాంటి గాడ్‌ఫాదర్ లేరని, ప్రజల ఆశీర్వాదం, కార్యకర్తల అండదండలతోనే ఈ స్థాయికి వచ్చానని డాక్టర్ రఘు పేర్కొన్నారు. ప్రజల విశ్వాసం ఉన్నంతకాలం ఎలాంటి కుట్రలు, మోసాలు తన రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేయలేవని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలే తనకు బలం, ప్రజల తీర్పే తనకు మార్గదర్శకమని అన్నారు.నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల అభిప్రాయాలకు పార్టీ నాయకత్వం మరింత విలువ ఇవ్వాల్సిన అవసరం ఉందని డాక్టర్ రఘు అభిప్రాయపడ్డారు. అలాంటి కార్యకర్తల సేవలను గుర్తించి ప్రోత్సహిస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందని చెప్పారు.చివరగా కోరుట్ల నియోజకవర్గ ప్రజలకు, బీజేపీ కార్యకర్తలకు, పార్టీ అభిమానులకు, తన రాజకీయ ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, త్వరలోనే తన రాజకీయ భవిష్యత్‌పై స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటిస్తానని డాక్టర్ రఘు వెల్లడించారు. దీంతో ఆయన తదుపరి రాజకీయ అడుగు ఏ పార్టీ వైపు ఉంటుందనే అంశంపై నియోజకవర్గంలో ఆసక్తికర చర్చ ప్రారంభమైంది.