సరూర్‌నగర్ ‘యువ సంగ్రామ’ సభకు వివేకానంద నగర్ నుంచి భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు

July 18, 2026 | తెలంగాణ

జనం న్యూస్, జూలై 18 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ముఖ్య అతిథిగా సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన ‘యువ సంగ్రామ’ సభకు కూకట్‌పల్లి నియోజకవర్గంలోని వివేకానంద నగర్ డివిజన్ నుంచి నిరుద్యోగ యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బీఆర్ఎస్ యువత అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు ఆదేశాల మేరకు బీఆర్ఎస్ యువత నాయకులు జగదీష్ గౌడ్, టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి యశ్వంత్ ఆధ్వర్యంలో సభకు బయలుదేరిన బస్సులను మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, సీనియర్ నాయకుడు మాచర్ల భద్రయ్యతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు మాట్లాడుతూ, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అప్పటి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన ‘యూత్ డిక్లరేషన్’ సభలో యువతకు ప్రతి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు గడిచినా ఆ హామీలు అమలు కాలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక ప్రక్రియలను పూర్తి చేసి సర్టిఫికెట్లు ఇవ్వడం మినహా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా యువతకు ఎలాంటి న్యాయం చేయలేదని విమర్శించారు.నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు భారత రాష్ట్ర సమితి తరఫున ఉద్యమం కొనసాగుతుందని, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, యువతకు ఇచ్చిన ప్రతి హామీ అమలు అయ్యే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో వేలాది మంది నిరుద్యోగ యువత, విద్యార్థులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ నిరుద్యోగ విధానాలకు వ్యతిరేకంగా తమ నిరసనను వ్యక్తం చేసినట్లు నాయకులు తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper