గట్టుపల్లి అంగన్వాడీ కేంద్రంలో నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ
జనం న్యూస్ 13 జులై వికారాబాద్ జిల్లా :- పూడూర్ మండలం గట్టుపల్లి అంగన్వాడీ కేంద్రంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా అల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆశా వర్కర్ మంజుల ఆధ్వర్యంలో 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు అల్బెండజోల్ మాత్రలు అందించి వేయించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ మంజుల మాట్లాడుతూ, చిన్నారుల్లో నులిపురుగుల సమస్యను నివారించడం, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, పోషకాహార లోపాలను తగ్గించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి అర్హత కలిగిన చిన్నారికి అల్బెండజోల్ మాత్ర తప్పనిసరిగా వేయించాలని సూచించారు. అలాగే 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి ఈ మాత్రలు వేయించేలా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని, అపోహలను నమ్మకుండా వైద్య సిబ్బంది సూచనలను పాటించాలని కోరారు. నులిపురుగుల నివారణ ద్వారా పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల మెరుగుపడటంతో పాటు ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు ఇది దోహదపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.