

– 62 శాతం లావాదేవీలు వాటిలోనే
– నేరాలకు బ్యాంకు ఖాతాలే కీలకం
– కరెంట్ ఖాతాల జారీలో బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం
– అవినీతి అధికారులపై చర్యలకు రంగం సిద్ధం.
దోచేస్తున్న సొమ్ము బదిలీకి (Cyber criminals)కు బ్యాంకు ఖాతాలు కీలకంగా మారాయి. వారు ఎక్కువగా ప్రైవేటు బ్యాంకులకు చెందిన ఖాతాలనే వినియోగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. 62 శాతం లావాదేవీలు వాటిలోనే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు బ్యాంకర్లపై కూడా నిఘా పెట్టారు. ఆ దిశగా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని నగర సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
హైదరాబాద్ సిటీ: సైబర్ నేరగాళ్లు కాజేసిన డబ్బును పలు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసి, సౌకర్యం ఉన్నచోట విత్డ్రా చేసుకుంటున్నారు. లేదంటే ఆన్లైన్లో కూపన్ల కొనుగోలు, లేదా క్రిప్టో కరెన్సీలోకి మార్చి విదేశాలకు పంపుతున్నారు. దీంతో సైబర్ నేరగాళ్ల(Cyber criminals)కు బ్యాంకు ఖాతాల అవసరం పెరిగింది. ఈ అవకాశాన్ని బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కమీషన్లకు కక్కుర్తి పడి సైబర్ నేరగాళ్లతో కుమ్మక్కవుతున్నారు. నిబంధనలకు పాతరేసి నకిలీ పత్రాలతో బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు సహకరిస్తున్నారు.