జనం న్యూస్- నవంబర్ 22- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్-నాగార్జునసాగర్
హిల్ కాలనీలోని కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రి అధికారులు, కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్య ధోరణితో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఆసుపత్రి డయాలసిస్ , ఆపరేషన్ లకు సంబంధించిన బయో వేస్ట్ ను ఆసుపత్రి ఆవరణలోనే తగలబెడుతున్నారు, ఈ బయో వేస్ట్ లో హ్యాండ్ గ్లౌజులు రక్తముతో నిండిన దూది, ప్లాస్టిక్ వ్యర్థాలను కలిపి తగలబెట్టడం వల్ల వాటి నుంచి వచ్చే ఘాటైన వాసనకు చుట్టుపక్కల నివాసితులు ఇబ్బందులు పడుతున్నామని, ఈ విషవాయువుల పీల్చటం వల్ల తాము శ్వాసకోశ వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని, ఆసుపత్రి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న వారి తీరు మారట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆసుపత్రి అధికారులు స్పందించి ఆసుపత్రి వ్యర్ధాలను వేరే చోటికి తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


